భద్రాచలం, ఆగస్టు 17 (Y7 News): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ మాట్లాడుతూ పేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం నిరంతరం కొనసాగించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందజేయాలని, సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేయవద్దని డిమాండ్ చేశారు.
పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ పథకాలను రద్దు చేయడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 6








