హార్ముజ్ జలసంధిపై అమెరికాకు “పూర్తి నియంత్రణ” ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వ్యూహాత్మకమైన ఈ జలమార్గం తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. ఇరాన్ బసీజ్ దళాల అధిపతి హొస్సేన్ తాయెబ్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధి ఇస్లామిక్ రిపబ్లిక్ నిర్వహణ, నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వాదనలను అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా తాజా పరిణామంగా నివేదించాయి.
అంతకుముందు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో అమెరికాకు హార్ముజ్‌పై “పూర్తి నియంత్రణ” ఉందని, దానిని కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా కొనసాగిస్తున్న నౌకా దిగ్బంధనాన్ని “వాల్ ఆఫ్ స్టీల్”గా అభివర్ణిస్తూ, దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్‌కు లేదని అన్నారు.
దీంతో హార్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారింది. ఇరువైపులా భిన్నమైన నియంత్రణ వాదనలు వినిపిస్తుండటంతో ఈ వ్యూహాత్మక జలమార్గంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హార్ముజ్ మీదుగా జరిగే చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం ఏర్పడటంతో ఈ పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి.








