E-PAPER

ఏఐ సాయంతో కల్తీ మద్యం తయారీ..! మధ్యప్రదేశ్‌లో 13 మంది మృతి..!

మద్యం తయారీ విధానం తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలో కల్తీ మద్యం విక్రయాలపై జరుగుతున్న దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కల్తీ మద్యం తాగి 13 మంది మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అజయ్‌ రాథోడ్‌ సెప్టెంబర్‌ నుంచి ఏఐ సాయంతో ఇంట్లో మద్యం తయారు చేసే పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. అనంతరం ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థ నుంచి రసాయనాలను తెప్పించినట్లు పోలీసులు తెలిపారు. సహ నిందితుల సహాయంతో రసాయనాలు, నీటిని ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

అక్టోబర్‌ 2 నుంచి 7 మధ్య స్క్రాప్‌ వ్యాపారుల నుంచి లైసెన్స్‌ కలిగిన మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వాటిలో కల్తీ మద్యం నింపి, అసలైన మద్యంతో కలిపి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. అక్టోబర్‌ 6 నుంచి 12 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఈ మద్యం విక్రయించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో అరెస్టయిన వారిలో దేవాస్‌, ఇండోర్‌ జిల్లాల్లోని మూడు లైసెన్స్‌ కలిగిన మద్యం దుకాణాలకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సేల్స్‌మెన్లు ఉన్నారు. వీరు నిందితులకు అక్రమంగా మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రసాయనాలు సరఫరా చేసిన ఇండోర్‌లోని గోదామును అధికారులు సీజ్‌ చేశారు. ఎనిమిది మంది నిందితులను మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించగా, మరో ఇద్దరిని జైలుకు పంపింది. 

దేవాస్‌ జిల్లాలోని చందనా, బింజనా గ్రామాల్లో కల్తీ మద్యం తాగి కనీసం 10 మంది చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ పట్వారీ మాత్రం 22 మంది మరణించారని, మరో 40 మందికి చూపు దెబ్బతిన్నదని ఆరోపించారు. అయితే మృతుల సంఖ్య, మరణాలకు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఇద్దరు మృతులకు సంబంధించిన నమూనాలు, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!