రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఫౌజీ (Fauzi). నిజానికి ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించినప్పటికీ.. పలు కారణాలవల్ల సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. ఈ సినిమా నుండి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఇటీవల అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం నుండి ఒక చిన్న టీజర్ విడుదల చేశారు. అందులో గూఢచారిగా ప్రభాస్ కనిపించారు. ఈ మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) ను తక్కువ చేసి చూపించారనే కారణంతో ఆయన మనవడు చంద్ర కుమార్ బోస్ (Chandra Kumar Bose) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర బృందం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు చిత్రబృందం ఈ విషయంపై స్పందించకపోవడంతో ఆయన ఏకంగా కేంద్రమంత్రికి లేఖ రాశారు.
సుభాష్ చంద్రబోస్ సోదరుడు , శరత్ చంద్రబోస్ మనవడైన చంద్ర కుమార్ బోస్.. ఫౌజీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రకు కల్పిత కథను జోడించడం నేరం , ఈ సినిమా మేకర్స్ భారత ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే ఇప్పుడు అంతటితో ఆగకుండా చరిత్ర వక్రీకరణకు తావులేని విధంగా కొత్త టీజర్ విడుదల చేయాలని సూచిస్తూ.. నేతాజీ పాత్రకు సంబంధించి మాకున్న అభ్యంతరాలు పరిష్కారమైతే ప్రభాస్ అలాగే మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు, హను రాఘవపూడి ఈ విషయంలోని తీవ్రతను గుర్తిస్తారని ఆశిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ .. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి రాసిన లేఖను చంద్రకుమార్ పంచుకున్నారు.
ఆ లేఖలో ఏముంది అనే విషయానికొస్తే..” ప్రభాస్ కథానాయకుడిగా , హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ అనే చిత్రం టీజర్ పై చెలరేగుతున్న వివాదం గురించి ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. నేతాజీ సహచరుడు, విప్లవ నాయకుడు భగవతి చరణ్ పాణిగ్రాహి 23వ బలిదాన్ దివస్ సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 23న ఈ మూవీ టీజర్ విడుదల చేశారు . ఈ టీజర్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుప్రీం కమాండర్, అఖండ భారత తొలి ప్రధాని అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ తో మాట్లాడుతూ ఫౌజీ అనే కల్పిత పాత్రను పరిచయం చేస్తున్నట్లు చూపించడం జరిగింది.
అయితే ఇక్కడ నేతాజీ పాత్రను ఇలా తక్కువ చేసి చూపించడాన్ని మేము ఖండిస్తున్నాము. ఇటువంటి అభ్యంతరకరమైన కంటెంట్ ను సెన్సార్ బోర్డు ఎలా క్లియర్ చేసిందో మాకు అర్థం కావడం లేదు. ఈ అంశాన్ని మీరు పరిశీలించి తగిన విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాము. ఈ టీజర్ ను వెంటనే తొలగించి, సెన్సార్ బోర్డులో దీని అనుమతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే.. అది దేశానికి చేసే సరైన సేవ అవుతుంది” అంటూ అశ్విని వైష్ణవ్ కి చంద్రకుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై కేంద్ర మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి








