E-PAPER

రావణుడిపై సాయిపల్లవి వ్యాఖ్యలు వైరల్‌..! సోషల్‌ మీడియాలో చర్చ..!

‘రామాయణం’లో సీతగా నటించిన సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. రావణుడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆమె చెప్పిన విషయాన్ని సమర్థిస్తున్నారు. లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన ‘రామాయణం’ సినిమా ప్రీమియర్‌ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

భారతీయ సంస్కృతి, ఇతిహాసాలపై ఆసక్తి ఉన్నవారికి తమ సినిమా మంచి పరిచయంగా నిలుస్తుందని సాయిపల్లవి అన్నారు. ‘రామాయణం’ను విశ్వసించే వారు ఆ కథ నుంచి తమను తాము పరిశీలించుకోవడం నేర్చుకోవాలని చెప్పారు. మనలోని మంచి, చెడులను గుర్తించి కాలక్రమంలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు. మనలోని రావణుడిని గుర్తించి, మనల్ని మనం మార్చుకోవడం ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. 

ఆమె మాటలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రావణుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె ఉద్దేశం రావణుడిని సమర్థించడం కాదని, మనలోని చెడు లక్షణాలను గుర్తించి సరిదిద్దుకోవాలనే సందేశమని అంటున్నారు. రావణుడిలోని కొన్ని మంచి లక్షణాలను ప్రస్తావించడం తప్పు కాదని మరికొందరు సమర్థిస్తున్నారు.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటించారు. ఈ సినిమా తొలి భాగం నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందే సాయిపల్లవి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!