ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ JBL Live Buds 4, JBL Live Beam 4లను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ రెండు మోడళ్లలో 10mm డైనమిక్ డ్రైవర్లు, ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సలింగ్ (ANC) 2.0, Hi-Res ఆడియో, JBL సిగ్నేచర్ సౌండ్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ JBL ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనుగోలుకు లభిస్తున్నాయి.
JBL Live Buds 4, Live Beam 4 రెండింటిలోనూ 10mm డైనమిక్ డ్రైవర్లతో పాటు Hi-Res Audio, JBL Spatial Sound, Personi-Fi 3.0, Personal Sound Amplification, Low Volume EQ, JBL Signature Sound ట్యూనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు వినియోగదారులకు మరింత స్పష్టమైన, నాణ్యమైన ఆడియో అనుభూతిని అందించేందుకు ఉపయోగపడతాయి.
డిజైన్ పరంగా రెండు మోడళ్లకు స్వల్ప తేడాలు ఉన్నాయి. JBL Live Buds 4 సిలికాన్ ఇన్-ఇయర్ టిప్స్‌తో సంప్రదాయ బడ్ డిజైన్‌లో వస్తే, JBL Live Beam 4 స్టెమ్-స్టైల్ ఇన్-ఇయర్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. తమ అవసరాలు, వినియోగ శైలికి అనుగుణంగా వినియోగదారులు ఈ రెండు మోడళ్లలో తమకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.









