E-PAPER

పలాసలో విజయవంతంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచార కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా, పలాస | వై7 న్యూస్

పెన్షనర్లకు సాంకేతిక సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పలాస రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచార కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

కేంద్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశ్రాంత రైల్వే ఉద్యోగుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నం రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కుందు రామారావు ముఖ్య సమక్షంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ కోసం బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజిటల్ విధానంలోనే ధ్రువీకరణ పొందే ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం ద్వారా సుమారు 60 మంది విశ్రాంత రైల్వే ఉద్యోగులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పెన్షనర్లు ఇంటి వద్ద నుంచే లేదా సమీప సేవా కేంద్రాల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సంచయ్, అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు, పలాస రైల్వే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!