శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్
బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల చిన్నారుల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని, వాటి నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు జిల్లా వ్యాప్తంగా ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ పేరుతో 100 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 27న జిల్లాలోని విద్యాసంస్థలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాల్య వివాహాల నివారణపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఇటువంటి వివాహాల కారణంగా బాలబాలికలు విద్యకు దూరమవడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టి, ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, భద్రతతో కూడిన భవిష్యత్తును అందించడమే ఈ ప్రత్యేక ప్రచారం ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాల్య వివాహాల నివారణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
బాల్య వివాహ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.









