E-PAPER

సర్పంచ్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరశంఖం పూరించాలి!

వజ్రపుకొత్తూరు మండల క్యాడర్‌కు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దిశానిర్దేశం


శ్రీకాకుళం జిల్లా, పలాస | వై7 న్యూస్

రాబోయే సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు.

పలాసలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రగతి భవన్‌లో వజ్రపుకొత్తూరు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనుభవాలను సమీక్షించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన కార్యాచరణతో సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ పరిణామాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో గళమెత్తుతూ, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగించాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే ప్రధాన బలమని పేర్కొంటూ, ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సమిష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వజ్రపుకొత్తూరు మండల వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ జెడ్పీ చైర్మన్ పాలిన శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు తిర్రి రాజారావు, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, తమ్మినేని శాంతారావు, కర్న శ్రీను, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!