ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న అంశం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించే సామర్థ్యం ఇరాన్‌కు లేదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అలాగే అమెరికా వద్ద మందుగుండు సామగ్రి కొరత ఏర్పడిందన్న వార్తలను ఖండిస్తూ, కీలక ఆయుధాల విషయంలో తమ వద్ద తగిన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
అయితే అమెరికా సైన్యం కొన్ని ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను ఇప్పటికే గణనీయంగా వినియోగించినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, ఆయుధాల తయారీ పెంపుపై అమెరికా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. తమ దేశంపై గరిష్ఠ స్థాయిలో ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ఇరాన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఆ దేశానికి ఇప్పటికీ క్షిపణి సామర్థ్యం ఉందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








