పలాస, ఆగస్టు 6 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ (JJM) పథకం కింద రూ.21.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌కు పలాస ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించి, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
సైనూరు గ్రామంలో నిర్మించనున్న ఈ వాటర్ ట్యాంక్ పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు తగినంత తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని ఆమె తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధిలో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.








