బూర్గంపాడు, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు);
సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపాడు మండల సదస్సు శుక్రవారం సారపాకలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఎ.జె. రమేష్ మాట్లాడుతూ ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మార్చిందని, 29 కార్మిక చట్టాలను సవరించడం ద్వారా కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నాలు కార్మికులకు ప్రమాదకరమని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ 2025లో ప్రతిపాదించిన విత్తన చట్ట సవరణలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని అన్నారు. రైతులు, కార్మికులు కలిసి మరోసారి దేశవ్యాప్తంగా ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సదస్సుకు ఎస్.కె. అబీద అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు కనకం వెంకటేశ్వర్లు, ఎస్.కె. పాషా, బత్తుల గోపాలరావు, ఆదూరి నరసింహారావు, ధర్మ, కన్నయ్య, మర్రి వెంకటరెడ్డి, సుధాకర్, శివ, పద్మ తదితరులు పాల్గొన్నారు.









