దుమ్ముగూడెం, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తురుబాక సమీపంలో రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి మారాయిగూడెం మార్గానికి మళ్లించారు.
అయితే మారాయిగూడెం వైపు వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒకేసారి అధిక సంఖ్యలో వాహనాలు మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. దీంతో భద్రాచలం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా తక్కువ సమయంలో చేరుకునే ప్రయాణానికి ప్రస్తుతం గంటన్నర నుంచి రెండు గంటల వరకు సమయం పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, అత్యవసర పనులపై వెళ్లేవారు, రోగులతో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై వరద నీటి పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి ప్రవాహం తగ్గిన వెంటనే సాధారణ రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.









