పలాస, జూలై 26 (వై7 న్యూస్):
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుమారుడి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బడగల బల్లయ్య తీవ్రంగా ఖండించారు. రోడ్డు ప్రమాద ఘటనను ఉద్దేశపూర్వక హత్యగా చిత్రీకరించడం సమంజసం కాదని, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మరియు ఆయన కుమారుడిపై నమోదు చేసిన హత్య కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు.
మాజీ మంత్రి అరెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బల్లయ్య, సమాజంలో ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అనేక మందిని తన సొంత వాహనంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన వ్యక్తి అప్పలరాజు అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని హత్య కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
దాన్నయ్య మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని బల్లయ్య పేర్కొన్నారు. అయితే ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనను ఉద్దేశపూర్వక హత్యగా పరిగణించి కేసు నమోదు చేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
ఈ కేసు కారణంగా 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, వైద్య విద్య చదవాల్సిన విద్యార్థి జీవితానికి అడ్డంకులు సృష్టించడం బాధాకరమన్నారు. చట్టం తన పని తాను చేసుకోవాలని, కానీ రాజకీయ ఒత్తిళ్లతో కేసులను మలచడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలకు బదులుగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందాలని సూచించిన బల్లయ్య, ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ విజయవంతం కావని వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలు ఉన్నా చట్టాన్ని దుర్వినియోగం చేయడం, ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయించడం వల్ల ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఈ ఘటనపై నిజానిజాలు నిష్పాక్షికంగా వెలుగులోకి రావాలని, చట్ట ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఆయన కోరారు.








