E-PAPER

అర్ధరాత్రి అశ్వాపురంలో బస్సు బీభత్సం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన బస్సు, తృటిలో తప్పిన పెను ప్రమాదం

అశ్వాపురం, జూలై 23 (వై7 న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి పెను ప్రమాదం తృటిలో తప్పింది. పాల్వంచ నుంచి మణుగూరు వైపు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అశ్వాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ అదుపు తప్పడంతో బస్సు డివైడర్ ఎక్కి నిలిచిపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఘటన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. బస్సు చక్రాలు గాల్లోకి లేచినట్లు కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో రహదారి భద్రతపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశ్వాపురం ప్రధాన రహదారిపై సరైన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సిగ్నల్స్, లైటింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెలకు ఒక ప్రమాదం చోటు చేసుకుంటున్నప్పటికీ ఆర్&బీ అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు.

ఇకనైనా రహదారిపై భద్రతా చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారించేలా సైన్ బోర్డులు, సిగ్నల్ సూచికలు, మెరుగైన వెలుతురు ఏర్పాటు చేయాలని ప్రజలు మరియు ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News