E-PAPER

భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలి – హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌కు బార్ అసోసియేషన్ వినతి

భద్రాచలం, జూలై 23 (వై7 న్యూస్)

భద్రాచలం ఏజెన్సీ ప్రాంత ప్రజలు, గిరిజనులు మరియు కక్షిదారులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భద్రాచలంలో వెంటనే అదనపు సెషన్స్ కోర్టు లేదా అసిస్టెంట్ సెషన్స్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. సారపాకలోని ఐటీసీ–పీఎస్‌పీడీని సందర్శించిన సందర్భంగా జస్టిస్ భీమపాక నగేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ప్రత్యేక చట్టాల పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతమని, ఇక్కడి ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు అవసరమని వివరించారు. ప్రస్తుతం భద్రాచలం, మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ల పరిధిలోని సుమారు 600కు పైగా సెషన్స్ కేసులు కొత్తగూడెం సెషన్స్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

అన్ని కేసులు కొత్తగూడెంలోనే విచారణకు రావడంతో గిరిజనులు, సామాన్య ప్రజలు తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం, ఆర్థిక భారం పెరగడం, సమయం వృథా కావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెం కోర్టులపై ఉన్న భారం తగ్గించడంతో పాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించేందుకు భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు.

2023 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి, కొత్తగూడెం నుంచి భద్రాచలానికి అదనపు సెషన్స్ కోర్టును మంజూరు చేయాలని లేదా మార్చాలని వినతిపత్రంలో అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, సీనియర్ న్యాయవాదులు గుడపర్తి నాగరాజు, షేక్ అక్తర్, పసుపులేటి రాంబాబు, పేరాల నాగరాజు, విజ్జగిరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!