‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల తన తదుపరి ప్రాజెక్ట్ కోసం పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన గత చిత్రాలకు భిన్నంగా మహిళా ప్రధాన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. కథకు బలమైన ప్రాధాన్యం ఉండటంతో పాటు, నటనకు విస్తృత అవకాశాలు కలిగిన పాత్రను కిషోర్ తిరుమల ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కథను సాయి పల్లవికి వినిపించగా, ఆమె నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని, నటీనటులు మరియు సాంకేతిక బృందం ఎంపిక పూర్తయిన తర్వాత సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కిషోర్ తిరుమల–సాయి పల్లవి కాంబినేషన్ నిజమైతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొనే అవకాశముంది.









