తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్, అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్కు పంపిన ప్రతిపాదనలో ఐదేళ్ల కాలపరిమితితో ‘బైలేటరల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ’ కింద ఈ సహాయాన్ని కోరినట్లు నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్తాన్ ఇప్పటికే ఐఎంఎఫ్ (IMF) నుంచి 7 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి మాత్రం కొనసాగుతోంది.
అమెరికా నుంచి ఆర్థిక సాయం లభిస్తే విదేశీ మారక నిల్వలు పెరగడంతో పాటు పాకిస్తాన్ కరెన్సీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుందని ఆ దేశం భావిస్తోంది. అలాగే ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఆధారపడే పరిస్థితి కొంత మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇందుకోసం అమెరికాతో ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ అధికారులతో సమావేశమై, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల కారణంగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను వివరించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు ఐఎంఎఫ్, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి లభించే రుణాలు, ఆర్థిక సహాయంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.








