పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: పోలీస్ శాఖలో విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవల తీరును పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు చిట్యాల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి విధుల నిర్వహణను సమీక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, వాటి దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కేసుల విచారణలో జాప్యం జరగకుండా పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.








