శ్రీకాకుళం: శ్రీకాకుళం మండలం పొన్నాం MPTC పరిధిలోని నవనంబాడు బూత్-2లో శుక్రవారం రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రీపోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. సహాయ కలెక్టర్ హరి ఓం పాండ్యా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
రీపోలింగ్‌కు కారణమిదే..
గురువారం జరిగిన ZPTC, MPTC ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలపై పోలింగ్ స్టేషన్ నంబర్ ముద్రించే సమయంలో అధికంగా సిరా పడటంతో బ్యాలెట్ పత్రాల ముందు భాగంలో మరకలు ఏర్పడ్డాయి. దీంతో ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేశారనే విషయంలో సందేహాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నవనంబాడు బూత్-2లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు.








