పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి అంశం మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఏకపక్ష ఆధిపత్యం దక్కకుండా అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్యల వెనుక ఇరాన్‌ను అడ్డుకోవడమే కాకుండా, చైనాకు కూడా పరోక్షంగా సందేశం పంపే ప్రయత్నం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ (ASEAN) విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ, హార్ముజ్ జలసంధిపై ఏ దేశానికీ ఏకపక్ష నియంత్రణ హక్కు లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలమార్గాలను నియంత్రించి అక్కడ ప్రయాణించే నౌకలపై టోల్ విధించడం లేదా చెల్లించకపోతే దాడులు చేస్తామని బెదిరించడం ప్రపంచానికి ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశానికి ముందు రుబియో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హార్ముజ్ అంశం కేవలం మధ్యప్రాచ్య సమస్య మాత్రమే కాదని, అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛకు సంబంధించిన కీలక అంశమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం, భద్రతా వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








