దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్‌మంతర్ సమీపంలో విద్యార్థులపై పోలీసులు చేసిన చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. సాధారణంగా సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే అరిజిత్ సింగ్ ఈ ఘటనపై వరుస పోస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును ప్రశ్నించారు.
అరిజిత్ సింగ్ తన పోస్టులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “విద్యార్థులను చంపేస్తున్నారు. మీకు సిగ్గు లేదా? నేతలు, మంత్రులు… అసలు ఏమి జరుగుతోంది? మీరే దేవుళ్లమని అనుకుంటున్నారా? జరిగిన ప్రతి విషయం ప్రజలు గుర్తుంచుకుంటారు. హర్ హర్ మహాదేవ్! ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మార్పే అని గుర్తుంచుకోండి” అంటూ వ్యాఖ్యానించారు.
మరో పోస్టులో పోలీసుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, “యూనిఫాంలో ఉన్న మనుషులు గూండాల్లా ప్రవర్తిస్తున్న వీడియోలు చూస్తున్నాను” అని మండిపడ్డారు. అరిజిత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.








