మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త రాజా రఘువంశీపై దాడి జరిగిన తర్వాత ఆమె ప్రవర్తనపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేసిన ధర్మాసనం, అవసరమైతే సోనమ్ బెయిల్‌ను రద్దు చేసి లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మంగళవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలే ధర్మాసనం మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సోనమ్‌కు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా సోనమ్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది.
“మీ ప్రవర్తనను ఎలా సమర్థించుకుంటారు? మీరు, మీ భర్త ఇద్దరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఆయనపై దాడి జరిగి మరణించాడు. ఆ తర్వాత మీరు ఏం చేశారు?” అంటూ కోర్టు ప్రశ్నించింది. అలాగే అరెస్ట్ కారణాలపై మొదటి నుంచే అభ్యంతరం వ్యక్తం చేశారా అని కూడా అడిగింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని లేదా సోనమ్ లొంగిపోయి ట్రయల్‌ను ఎదుర్కోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది.








