కేంద్రంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 ఇంధనం (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్)పై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన సీ-ఓటర్ సర్వేలో E20 పెట్రోల్ వినియోగంపై ఆసక్తి లేని వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. జూన్ 8, 9 తేదీల్లో 18 ఏళ్లు పైబడిన 1,641 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో 52 శాతం మంది E20 వినియోగానికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 22 శాతం మంది మాత్రమే దీనికి మద్దతు తెలిపారు.
సర్వే వివరాల ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారిలో కూడా 53 శాతం మంది E20 పెట్రోల్ వాడేందుకు ఆసక్తి చూపించలేదు. దాదాపు 55 శాతం మంది ఈ ఇంధనం వల్ల వాహనాలకు నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తుండగా, 52.8 శాతం మంది ఇంజన్ పనితీరుపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో 76 శాతం మంది ప్రజలు సాధారణ పెట్రోల్‌తో పాటు E20 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. వినియోగదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాగే E20 పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండాలని పలువురు సూచించారు.









