E-PAPER

తెలంగాణ గిరిజన సమైక్య 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: సోందే కుటుంబరావు

అశ్వాపురం, జూలై 14 (వై7 న్యూస్): ఈ నెల 18, 19 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సమైక్య 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొందే కుటుంబరావు పిలుపునిచ్చారు.

అశ్వాపురం మండలంలో సోమవారం నిర్వహించిన గిరిజన సమైక్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, అటవీ బంజరు మిగులు భూముల పంపిణీ, గిరిజనులకు ఇండ్ల స్థలాలు మరియు పట్టాలు మంజూరు చేయడం, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ట్రైకర్ రుణాలు అందించడం, గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, విద్య, వైద్యం, విద్యుత్, రహదారులు, వంతెనలు, తాగునీరు, సాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, జీవో నెంబర్-3 పునరుద్ధరణ, ఏజెన్సీ డీఎస్సీ నిర్వహణ వంటి డిమాండ్లను మహాసభలో ప్రధానంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

జూలై 18న పాల్వంచ పట్టణంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, 19న బీసీఎం రోడ్డులోని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌లో ప్రతినిధుల మహాసభ జరగనున్నట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ మహాసభలకు గిరిజన సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకత్వంతో పాటు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, రాష్ట్ర, జిల్లా స్థాయి గిరిజన నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.

సమావేశం అనంతరం అశ్వాపురం మండల గిరిజన సమైక్య నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కల్లూరి నరసింహారావు, సహాయ కార్యదర్శిగా కంగాల నరసింహారావు ఎన్నికయ్యారు. అనంతరం మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్, మేలపురి సురేందర్ రెడ్డి, గిరిజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బాడిశా సతీష్, జిల్లా కమిటీ సభ్యుడు వజ్జా వెంకటేశ్వర్లు, మండల నాయకులు కనితి సత్యనారాయణ, రాయపూడి రాజేష్, గారబోయిన నరేష్, కన్నెబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!