E-PAPER

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి: సిటియు

శ్రీరాంపూర్, జూలై 14 (వై7 న్యూస్): సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలవుతున్న హైపవర్ కమిటీ వేతనాలను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (ఎస్‌సీకేఐఎస్-సిటియు) నాయకులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు.

సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పీ-3 ప్రాంతానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఎస్‌సీకేఐఎస్-సిటియు ఆధ్వర్యంలో నాయకులు మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం బెల్లంపల్లి రిజియన్ అధ్యక్షుడు గట్టు మహేందర్, కార్యదర్శి దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ, కోల్ ఇండియాలో 2013లో కుదిరిన ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ, తెలంగాణలోని సింగరేణి సంస్థలో మాత్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు.

దేశంలోని ఇతర బొగ్గు గనుల్లో అమలవుతున్న ఈ వేతన విధానం సింగరేణిలో అమలు కాకపోవడంతో ఒక్కో కాంట్రాక్టు కార్మికుడు నెలకు సుమారు రూ.19 వేల వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కార్మిక సంఘాలు అనేకసార్లు పోరాటాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించడం లేదని విమర్శించారు.

సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించేలా హైపవర్ కమిటీ వేతనాలను వెంటనే అమలు చేయాలని, అలాగే 2013 నుంచి రావాల్సిన బకాయిలను (ఏరియర్స్) కూడా కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌సీకేఐఎస్-సిటియు శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి కాసిపేట రాజేశం, గుజ్జేటి రమేష్, తలారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!