E-PAPER

ఎరువుల ఆన్‌లైన్ నిబంధనలపై సీపీఎం తీవ్ర ఆగ్రహం

– పట్టాలు రాని రైతులు పట్టాలు ఎక్కడ కొనుక్కోవాలంటూ మండిపాటు
– రైతులను ఇబ్బంది పెడితే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న

పినపాక

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల బట్టి పంటలు పండుతాయో లేదో తెలియని తీవ్ర ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని ఎరువుల ఆన్‌లైన్ నిబంధనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నప్పటికీ, రైతులు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తున్నారన్నారు.భూములకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఎంతో అవసరమని తెలిసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచకుండా చిన్న కమతాలను, వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయని మండి పడ్డారు . ఎరువుల కోసం ఆన్‌లైన్ యాప్‌లో అప్లై చేసుకోవాలనే నిబంధన చదువురాని వారికి, నిరక్షరాస్యులకు, ముఖ్యంగా గిరిజన రైతులకు పెద్ద శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

**పాస్ పుస్తకాలు లేని పోడు రైతులకు ఎరువులెలా?*

యాప్‌లో ఎరువులు బుక్ చేసుకోవడానికి పట్టాదార్ పాస్ పుస్తకం తప్పనిసరి చేశారని, కానీ ప్రభుత్వం ఇంకా పట్టాలు ఇవ్వని పోడు భూముల రైతులకు, పాస్ పుస్తకాలు లేని పేద రైతులకు ఎరువులు ఎలా లభిస్తాయని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వమే పాస్ పుస్తకాలు ఇవ్వనప్పుడు, రైతులు వాటిని కిరాణా షాపుల్లోనో, బుక్ స్టాళ్లలోనో కొనుక్కోవాలా అని నిలదీశారు.
పాస్ పుస్తకాలు లేని రైతులు వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్తే పాస్ పుస్తకం తేవాలంటున్నారని, తహసీల్దార్ దగ్గరకు వెళ్తే కలెక్టర్ నుంచి ఆదేశాలు రావాలని కాలయాపన చేస్తున్నారని అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని ఎండగట్టారు. అధికారులకు కనీస ఇంగితజ్ఞానం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుర్చీల్లో కూర్చుని జీతాలు తీసుకోవడం కాదు, క్షేత్రస్థాయిలో రైతుల బాధలను గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి కఠిన ఆన్‌లైన్ విధానాల వల్ల రైతులు వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కింది స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఏ రైతు ఎంత భూమి సాగు చేస్తున్నాడో, అతనికి ఎంత ఎరువు అవసరమో రికమండ్ చేసి నేరుగా ఎరువులు అందించే సులువైన పద్ధతిని తీసుకురావాలన్నారు. ఈ ఆన్‌లైన్ నిబంధనలలో మార్పులు చేయకపోతే పినపాక మండలంలోని రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మడివి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News