3 స్వర్ణ, 7 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు కైవసం
భద్రాద్రి కొత్తగూడెం, వై7 న్యూస్, జూలై 14:
జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది విశేష ప్రతిభ కనబర్చి మొత్తం 12 పతకాలు సాధించారు. ఇందులో 3 స్వర్ణ, 7 రజత, 2 కాంస్య పతకాలు ఉండటం విశేషం.
కొత్తగూడెం–I టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. కరుణాకర్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించగా, ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో రజత పతకం, ఆఫీస్ ఆటోమేషన్ విభాగంలో కాంస్య పతకం అందుకున్నారు.
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌కే నాగుల్‌మీరా నార్కోటిక్ డాగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి ప్రతిభ చాటారు.
అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు రెడ్డి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో, ఇల్లందు ఎస్‌ఐ కె. ఉమా దర్యాప్తు ఆధారిత ఫోటోగ్రఫీ విభాగంలో, ఐటీ కోర్ పీసీ కె. నరేష్ ప్రోగ్రామింగ్ సామర్థ్య విభాగంలో, చెర్ల పీసీ ఎస్. అయ్యప్ప పోలీస్ ఫోటోగ్రఫీ విభాగంలో, ఏఆర్ పీసీ కె. మహేష్ ట్రాకర్ డాగ్ విభాగంలో రజత పతకాలు సాధించారు.
అదేవిధంగా బూర్గంపాడు డబ్ల్యూపీసీ బి. పావని పోలీస్ అబ్జర్వేషన్ విభాగంలో రజత పతకం, పోలీస్ పోర్ట్రెయిట్ విభాగంలో కాంస్య పతకం అందుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పతక విజేతలను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.








