కరకగూడెం, జూలై 14 (వై7 న్యూస్ తెలుగు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా హాస్యాస్పదమని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ విమర్శించారు.
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న తుడుందెబ్బ ఉద్యమాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ మండల అధ్యక్షుడి బలహీనతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తన అక్రమాలను ప్రశ్నించినందుకే వ్యక్తిగతంగా ఎదుర్కోలేక సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందు మరియు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మండల ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వెంకటనారాయణ అన్నారు. ఎవరు ఎంత ఆస్తులు సంపాదించారో, ఎవరి ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
ఆదివాసీల హక్కుల పరిరక్షణ, షెడ్యూల్ ప్రాంతాల చట్టాల అమలు, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం తుడుందెబ్బ నిరంతరం పోరాటం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
“మీ తాటాకు చప్పట్లకు, బెదిరింపులకు తుడుందెబ్బ భయపడదు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే మా గొంతును ఎవరూ మూయలేరు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమైతే ఎప్పుడైనా స్వాగతిస్తాం” అని పోలేబోయిన వెంకటనారాయణ పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసమే తమ బలం అని, ఎలాంటి బెదిరింపులు లేదా విమర్శలు తుడుందెబ్బ ఉద్యమాన్ని వెనక్కి తగ్గించలేవని ఆయన స్పష్టం చేశారు.
– వై7 న్యూస్ తెలుగు








