పినపాక, వై7 న్యూస్, జూలై 14:
పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొల్లినేని సురేష్ యాదవ్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు రాజీనామా లేఖను పంపించారు.
యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై కాంగ్రెస్ నాయకుడు శివ చరణ్ రెడ్డి అసభ్యకరంగా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ, అలాంటి నాయకత్వంలో కొనసాగడం తనకు ఇష్టం లేదని సురేష్ యాదవ్ పేర్కొన్నారు.
అలాగే, తన సామాజిక వర్గమైన యాదవులపై దుర్భాషలాడడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, ఈ పరిస్థితుల్లో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగలేనని తెలిపారు.
పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, పదవికి రాజీనామా చేసినప్పటికీ సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఈ పరిణామం పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సురేష్ యాదవ్ రాజీనామాపై జిల్లా నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.









