అశ్వాపురం , జూలై 14 (వై7 న్యూస్):
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విరుద్ధమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయిని ముందస్తుగా అరెస్టు చేయడం ద్వారా విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, ఉద్యమాలను అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు.
రెండున్నర సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకుండా మాటలు మారుస్తూ వస్తోందని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో వేలాది మంది విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విద్యార్థి ఉద్యమాలను అడ్డుకునే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు.









