భద్రాచలం, జూలై 11 (వై7 న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి రావులపల్లి రాంప్రసాద్ తీవ్రంగా ఖండించారు. చింతకాని మండలంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ రైతుల సంక్షేమంపై కాకుండా ముఖ్యమంత్రి ఆక్రోశాన్ని వ్యక్తపరిచే వేదికగా మారిందని ఆయన విమర్శించారు.
సభకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదని, ఏర్పాటు చేసిన 25 వేల కుర్చీలను కూడా నింపలేక కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాంప్రసాద్ పేర్కొన్నారు. సభకు వచ్చిన ఖాళీ బస్సులే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులపై ఒత్తిడి తెచ్చి సభకు తరలించారని ఆరోపించారు. రైతుల సంక్షేమం పేరుతో నిర్వహించిన సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అమలైన రైతు బంధు పథకం ద్వారా 11 విడతల్లో సుమారు రూ.73 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎప్పుడూ భారీ సభలు నిర్వహించి ప్రజాధనాన్ని వృథా చేయలేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని వ్యాఖ్యలను వినలేక పలువురు ప్రజలు సభ మధ్యలోనే వెళ్లిపోయారని రాంప్రసాద్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆ పదవికి తగదని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.









