ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శనివారం తెల్లవారుజామున బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం ఆరుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వరుస పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడగా, అనంతరం వైమానిక దాడి హెచ్చరికలు జారీ చేశారు.
దాడి కారణంగా నగరంలోని ఒక ప్రాంతంలో నివాసేతర భవనం దెబ్బతినగా, మరో ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఒక కార్యాలయ భవనంలో భారీగా మంటలు చెలరేగినట్లు నగర సైనిక పరిపాలన తెలిపింది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ సబ్‌స్టేషన్‌కు కూడా నిప్పంటడంతో పాటు, పలు నివాస భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు మేయర్ విటాలి క్లిచ్కో వెల్లడించారు.
ఇటీవలి వారాల్లో కీవ్‌పై రష్యా దాడుల తీవ్రత మరింత పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి కీవ్ నగరం, పరిసర ప్రాంతాలపై జరిగిన వరుస దాడుల్లో ఇప్పటికే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. తాజా ఘటనతో రాజధానిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.








