అశ్వాపురం, జూలై 11(వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని చింతిర్యాల కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని, స్థానిక పాలన వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఇది ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, పంచాయతీ శాఖ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, జిల్లా ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








