మెసేజింగ్ యాప్‌లలో యూజర్‌నేమ్ ఫీచర్‌పై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల వాట్సాప్‌కు పంపిన నోటీసుల తరహాలోనే, యూజర్‌నేమ్ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్రం కోరినట్లు సమాచారం.
వాట్సాప్ త్వరలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుండగా, టెలిగ్రామ్‌లో ఇప్పటికే యూజర్‌నేమ్ వ్యవస్థ అమల్లో ఉంది. సిగ్నల్‌లో కూడా వినియోగదారులు తమ ఇష్టానుసారం ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ విధానం ద్వారా ఫోన్ నంబర్‌ను పంచుకోకుండా కేవలం యూజర్‌నేమ్‌తోనే కొత్త వ్యక్తులతో చాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేయడానికే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఆయా సంస్థలు గతంలో వెల్లడించాయి.
అయితే, యూజర్‌నేమ్ ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రారంభించవద్దని వాట్సాప్‌కు కేంద్రం సూచించగా, నోటీసుకు మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.








