E-PAPER

తెలంగాణకు మూడు కొత్త విమానాశ్రయాలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో వరంగల్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉత్తర తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్‌లో పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే సంయుక్త విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు త్వరలో వచ్చే అవకాశముందని వెల్లడించారు.

తెలంగాణను ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,500కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన విడిభాగాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో టాటా సికోర్స్కీ, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి అంతర్జాతీయ సంస్థలు హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ల విడిభాగాలను తయారు చేస్తుండగా, సఫ్రాన్, జీఈ ఏరోస్పేస్ సంస్థలు ఇంజిన్ భాగాల తయారీతో పాటు మెయింటెనెన్స్ సేవలు అందిస్తున్నాయని వివరించారు. దీంతో తెలంగాణ ఏరోస్పేస్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News