ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీబీ జీ రామ్ పథకం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, దీనిపై ఉన్న అభ్యంతరాల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ తొలి దశకు రూ.7,345 కోట్లతో ఆమోదం తెలుపుతూ టెండర్లు పిలిచేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు అమలవుతున్న ఈ పథకాన్ని ఉపాధ్యాయులకు విస్తరించడంతో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
అదేవిధంగా టిమ్స్, వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 6 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన కేబినెట్, గోదాములు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన స్థలాల కేటాయింపుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఊతమిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.








