E-PAPER

తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణలో వరుసగా చోటుచేసుకున్న హై ఓల్టేజ్ బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కరీంనగర్, వరంగల్ డిపోల పరిధిలో బ్యాటరీ లీకేజీల కారణంగా బస్సులు అగ్నికి ఆహుతైన ఘటనలపై జేబీఎం సంస్థ నుంచి సరైన వివరణ, భద్రతపై హామీ కోరినా స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి సాంకేతిక నివేదికలు, భద్రతా ధ్రువీకరణ వచ్చిన తర్వాతే సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

గత నెల జూన్ 21న కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే, రెండు రోజుల క్రితం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవడంతో మంటలు ఇతర బస్సులకు వ్యాపించకుండా అడ్డుకుని పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడం ఊరటనిచ్చింది.

ఈ వరుస ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బస్సుల సేవలను నిలిపివేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రమాదాలపై పూర్తి విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యల ప్రణాళిక, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్‌తో పాటు అవసరమైన సాంకేతిక వివరాలను సమర్పించాలని జేబీఎం సంస్థను తెలంగాణ ఆర్టీసీ కోరింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News