పలాస, జూన్ 30 (వై7 న్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అదృశ్యమయ్యారంటూ వస్తున్న వార్తలు శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఆయన ముఖ్య అనుచరురాలు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
డిప్యూటీ సీఎం పై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ కొత్తూరు పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరినట్లు సమాచారం.
అయితే, ఆయన బయలుదేరి గంటలు గడిచినా పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదని, ఆయన మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో స్పందించిన దివ్వెల మాధురి, పోలీసులు ప్రణాళికాబద్ధంగా దువ్వాడ శ్రీనివాస్‌ను దారిలోనే అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఆయనను కోర్టులో హాజరుపరచాలని, ఆయన ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే మాధురి ఆరోపణలను కొత్తూరు పోలీసులు ఖండించారు. దువ్వాడ శ్రీనివాస్ తమ పోలీస్ స్టేషన్‌కు రాలేదని, ఆయన అదృశ్యంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యగా దివ్వెల మాధురిని హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.
దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.








