దుమ్ముగూడెం, ఆగస్టు 19 ( వై 7న్యూస్ ); దుమ్ముగూడెం మండలం ,దుమ్ముగూడెం గ్రామానికి చెందిన గౌరారపు నరసింహారావు అనే సెర్ప్ ఉద్యోగిపై కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి దాడి చేసి హత్యాయత్నం చేశారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో ఇంటిలో ఉన్న నరసింహారావు వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరు దుండగులు కుటుంబ సభ్యుల ముందే నరసింహారావును విచక్షణ రహితంగా భుజం ఇతర అవయవాలపై పొడిచి, వారి ద్విచక్ర వాహనం వెంట లాక్కొని వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వారి కుటుంబ సభ్యులను విషయం బయటకు చెబితే అందరిని చంపేస్తాను అంటూ ఫోన్ ద్వారా బెదిరించిన దుండగులు నరసింహారావును స్వగ్రామమైన దుమ్ముగూడెంలోకి తీసుకువచ్చి ఒకచోట పడేసి పరారయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో 100కు డయల్ చేసి విషయం తెలియజేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారు. బాధితుడికి తీవ్ర రక్తం స్రావం జరుగుతుండడంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుడిని ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్యాధికారి సిబ్బంది ఫోన్ లతోపాటు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయకపోగా నేరుగా వైద్యాధికారి క్వార్టర్స్ కి వెళ్లి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం చేసిన ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది క్షతగాత్రుని భద్రాచలం వైద్యశాలకు తరలించారు. సెర్ఫ్ ఉద్యోగి నరసింహారావు పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం……









