ములుగు, ఆగస్టు 18: ములుగు జిల్లా డీఎస్పీ ఎన్. రవీందర్ నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పరిపాలనా విధానాలను పరిశీలించారు.
తనిఖీలో భాగంగా రౌడీషీటర్లు, కేడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా యువత, విద్యార్థుల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ 5S విధానాన్ని పాటించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని తెలిపారు.
ఈ సందర్భంగా “నేను సైతం” కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ ఎన్. రవీందర్ ప్రారంభించారు. ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని పేర్కొంటూ, ప్రజలంతా తమ వంతు బాధ్యతగా తమ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పసర సీఐ దయాకర్, నార్లాపూర్ ఎస్‌హెచ్‌వో ఎస్. కమలాకర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








