శ్రీకాకుళం, జూన్ 30 (వై7 న్యూస్):
మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ శ్రీకాకుళం జిల్లా పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల్లో మహిళలు, విద్యార్థినుల కోసం “నారీ శక్తి” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, దాని ప్రయోజనాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బాల్య వివాహాల నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని తమ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళలపై నేరాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.









