దుమ్ముగూడెం , జూన్ 28 ( వై 7 న్యూస్ తెలుగు);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపై అతివేగంగా సంచరిస్తున్న లారీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అనేక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ధర్నాలు, నిరసనలు నిర్వహించినా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేవని విమర్శిస్తున్నారు.
అతివేగ లారీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాల్లో వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని, తరచూ వాహనాల తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు భద్రతపై అధికారులు తక్షణమే దృష్టి సారించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.
– రిపోర్టర్ ;
దివ్య








