సిరిసిల్ల జిల్లా:
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో తల్లి–కొడుకులు ఇద్దరూ ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక స్థితి బాగాలేక నదిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకోగా, ఆవేదనతో అదే నదిలోకి దూకి కొడుకు కూడా మరణించటం స్థానికులను కలచివేసింది.
తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్ (34) తన తల్లి మంచికట్ల లలిత (56) తో కలిసి నివాసం ఉంటున్నాడు. గురువారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న అభిలాష్‌కు తల్లి కనిపించకపోవడంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆధారాలపై గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
శుక్రవారం ఉదయం తంగళ్లపల్లి ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని మానేరు నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించగా, అది తన తల్లిదేనని అభిలాష్ గుర్తించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను బంధువుల ముందే తీవ్ర మనోవేదనకు గురై అదే నదిలోకి దూకేశాడు.
దాదాపు రెండు గంటలపాటు విస్తృతంగా గాలింపు చేసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చివరకు అభిలాష్ మృతదేహాన్ని వెలికి తీశాయి. ఒకే కుటుంబంలో తల్లి–కొడుకులు ఇలా ప్రాణాలు తీసుకోవడం తంగళ్లపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









