BRS పార్టీలో వికలాంగుల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షుడు జిల్లేపల్లి శివకృష్ణ నివాసానికి విచ్చేసిన BRS పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగులు అనేక సామాజిక, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి సమస్యలను రాజకీయ వేదికపై బలంగా వినిపించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వికలాంగుల విభాగాలను ఏర్పాటు చేసి రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు.
BRS పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వికలాంగులకు ప్రాధాన్యత లభిస్తుందని, పార్టీ బలోపేతానికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు. అలాగే పార్టీ నూతన కార్యవర్గాల్లో వికలాంగులకు తగిన స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, పెన్షన్ల పెంపు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు వంటి అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ఈ సమస్యలపై BRS పార్టీ తరఫున పోరాటం చేయాలని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ను కోరినట్లు గిద్దె రాజేష్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్, స్పెరోస్ మండల నాయకుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.








