పలాస, జూలై 3 (వై7 న్యూస్): జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు డైట్ (DIET) అధ్యాపక బృందం పలాస మండలంలోని పలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పాఠశాలల అకాడమిక్, పరిపాలనా వ్యవహారాలు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది.
ఈ సందర్భంగా చిన్నబాదం, ఉదయపురం, పలాస-కాశీబుగ్గ, గరుడకండి, పీఎన్‌ఆర్ కాలనీ, అంబుసోలి ప్రాంతాల్లోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెంట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నబాదం పాఠశాలలను సందర్శించారు.
తనిఖీల్లో భాగంగా ప్రతి పాఠశాలలో తరగతి గదులను సందర్శించిన డైట్ బృందం విద్యార్థుల అభ్యసన స్థాయిని పరీక్షించింది. ఉపాధ్యాయుల బోధనా విధానాలు, బోధనలో ఉపయోగిస్తున్న టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్, విద్యార్థుల నోటు పుస్తకాలు, రికార్డులు, వార్షిక ప్రణాళికలు, పాఠ్యాంశాల పురోగతి, విద్యార్థుల క్రమశిక్షణ వంటి అంశాలను పరిశీలించింది. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తీరును కూడా సమీక్షించింది.
పాఠశాలల పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాల ఆవరణ శుభ్రత, మొక్కల సంరక్షణ, మౌలిక వసతుల స్థితిగతులను కూడా బృందం పరిశీలించింది. విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని డైట్ బృందం అభిప్రాయపడింది.
ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు ఇదే తరహా కృషిని కొనసాగించాలని సూచించింది. తనిఖీల సందర్భంగా గుర్తించిన అంశాలపై మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, సత్యనారాయణలతో బృందం చర్చించింది.
ఈ తనిఖీల్లో డైట్ అధ్యాపకులు ఎ. వేణుగోపాల్, జి. ఇందువదన, ఎస్. మురళి, కె. రాజీవ్ కుమార్, ఎస్. రమణ తదితరులు పాల్గొన్నారు.








