పలాస, జూలై 3 (వై7 న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ బాధ్యత అని పలాస ఎమ్మెల్యే Goutu Sirisha పేర్కొన్నారు. శుక్రవారం పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వయంగా ఆలకించారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుతో విన్న ఎమ్మెల్యే, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు వారి సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా దర్బార్‌లో ప్రధానంగా పెన్షన్లు, రోడ్ల నిర్మాణం, భూ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన మొత్తం 27 వినతులు అందినట్లు వెల్లడించారు. అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
పలాస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.








