దమ్మపేట, మే 9:
దమ్మపేట మార్కెట్ యార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తంబళ్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే దశలో అనేక అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. యార్డ్‌కు ధాన్యం వచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“లారీలు లేవు” అనే సాకుతో అధికారులు కాలయాపన చేయడం సరికాదని, యార్డుల్లో ధాన్యాన్ని ఎంతకాలం నిల్వ ఉంచుతారని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మరింత నష్టపోతున్నారని తెలిపారు.తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దొడ్డా సతీష్, సొరకాయల సీతారాములు తదితరులు, రైతులు పాల్గొన్నారు.









