ఖమ్మం, జూలై 3 (Y7 News):
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏన్కూర్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి గంట వ్యవధిలోనే మిస్సింగ్ అయిన బీటెక్ విద్యార్థిని గుర్తించి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చారు.
నూకాలంపాడు గ్రామానికి చెందిన వేల్పుల యాకూబ్ తన కుమారుడు వేల్పుల ప్రవీణ్ కుమార్ (21) కనిపించడం లేదని 03-07-2026న ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్ ఘట్కేసర్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతూ శ్రీనివాస్ హాస్టల్‌లో ఉంటున్నాడు. వేసవి సెలవుల సందర్భంగా ఇంటికి రావాలని తండ్రి కోరగా రెండు రోజుల్లో వస్తానని చెప్పి రాలేదు. అనంతరం ఖమ్మంలో స్నేహితుల వద్ద ఉన్నానని తెలిపిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏన్కూర్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ సాంకేతిక విశ్లేషణ ఆధారంగా ఖమ్మం పట్టణంలోనే గంట వ్యవధిలో ప్రవీణ్ కుమార్‌ను సురక్షితంగా గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
మిస్సింగ్ కేసుల విషయంలో పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో స్పందిస్తారని, కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించకుండా పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.








