భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శనివారం నిజాయితీకి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. రామయ్య దర్శనానికి రాజమండ్రి నుంచి వచ్చిన వీర బ్రహ్మానంద స్వామి అనే భక్తుడు దర్శనం సమయంలో పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్‌ను దేవస్థానం అధికారులు తిరిగి ఆయనకు అందజేశారు.
దేవాలయంలో దర్శనం అనంతరం తన బంగారు బ్రాస్లెట్ కనిపించకపోవడంతో భక్తుడు ఆందోళన చెందాడు. ఇదే సమయంలో కొత్తగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు అనే భక్తుడికి ఆ బ్రాస్లెట్ దొరికింది. అనంతరం భద్రాచలంకు చెందిన జి. వెంకటేశ్వరరావు సహకారంతో ఆ బంగారు బ్రాస్లెట్‌ను దేవస్థానం అధికారులకు అప్పగించారు.
ఈ క్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, SPF సిబ్బంది సమక్షంలో పోగొట్టుకున్న వీర బ్రహ్మానంద స్వామికి బ్రాస్లెట్‌ను తిరిగి అందజేశారు. కాగా ఆ బంగారు బ్రాస్లెట్ విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉండటం విశేషం.
పోగొట్టుకున్న ఆభరణాన్ని నిజాయితీగా తిరిగి అప్పగించిన వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావులను దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.








